Political War in YSRCP: కొండెపి వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు.. వెలసిన పోస్టర్లు.. - అశోక్ బాబు మా ఇంటికి రావొద్దంటూ పోస్టర్లు
Political War in YSRCP at Kondepi : సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. నువ్వా నేనా అనేంతగా వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుల్లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొండెపి మండలం మిట్టపాలెంలో నేడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్బాబు 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా వైఎస్సార్సీపీలోని మరో వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. అశోక్ బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ మాదాసి వెంకయ్య వర్గం గ్రామంలో ఇంటింటికీ పోస్టర్లు అంటించారు. అశోక్బాబు మా ఇంటికి రావొద్దంటూ పోస్టర్లలో రాశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పర్యటనను వాయిదా వేసుకోవాలని అశోక్ బాబుకు సూచించగా ఆయన ససేమిరా అన్నారు. గ్రామంలో ఉద్రిక్తత నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి భారీగా స్పెషల్ పార్టీ పోలీసుల బయలుదేరారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.