నెల్లూరులో నాటకీయ పరిణామాలు.. ఎట్టకేలకు సయ్యద్ సమీ అరెస్ట్ - సయ్యద్ సమీని అరెస్టు చేసిన పోలీసులు
Police Arrest Indian National League State President Syed Sami in Nellore : ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు సయ్యద్ సమీని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం హత్యాయత్నం కేసులో సయ్యద్ సమీని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేసినందుకు నెల్లూరు నగరంలో పోలీసులు అరెస్టుల పర్వానికి తెర తీశారు. సయ్యద్ సమీ ఇటీవల రొట్టెల పండుగ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత సమీ లక్ష్యంగా పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటికి వచ్చారు. ఇంటిని పెద్ద ఎత్తున పోలీసులు ముట్టడి చేశారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీని అరెస్ట్ చేసేందుకు కొద్ది సేపు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని పోలీసులతో సమీ వాగ్వాదానికి దిగారు. సమీకి మద్దతుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులతో చర్చలు జరిపారు. మైనార్టీలను భయబ్రాంతులకు గురి చేయడం ఏం పద్ధతి అని పోలీసులను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు సమీకి నోటీసులు ఇవ్వకుండా, అరెస్టు చేయకుండా వెనుదిరిగారు. కానీ సాయంత్రానికి సీన్ మారింది.. ఓ హత్యాయత్నం కేసులో సయ్యద్ సమీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.