మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు - తీవ్ర ఉద్రిక్తత - Police stopped Bhuma
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 10:15 AM IST
Police Stopped Bhuma Akhila Priya in Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. దొర్నిపాడు మండలం కొండాపురంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి షెడ్యూల్ ఖరారు చేశారు. అఖిలప్రియ కూడా అదే మండలంలోని భాగ్యనగరం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరారు. ఇద్దరు నేతలు ప్రచారం నిర్వహించే గ్రామాలు పక్కపక్కనే ఉండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భూమా అఖిల ప్రియని అడ్డుకున్నారు.
ఆమెను ముందుకు కదలనివ్వకుండా ఆళ్లగడ్డ సీఐ హనుమంతు నాయక్ తన సిబ్బందితో పట్టణ సమీపంలోని రహదారిలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా తాను ప్రచారం నిర్వహించుకుంటానని భూమా అఖిలప్రియ తెలపడంతో పోలీసులు ఆమెను భాగ్యనగరం గ్రామానికి వెళ్లేందుకు అనుమతించారు. గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆమె బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.