ఎంపీ ఆదేశాలతో ఆర్థిక నేరగాడి అరెస్టు - అర్థరాత్రి అరగంటలో విడిపించుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 19, 2023, 1:44 PM IST
Police Released YSRCP Financial Criminal: ఆర్థిక నేరగాళ్లను చట్టానికి పట్టించాల్సిన ప్రజాప్రతినిధులే.. వాళ్లకు రక్షణగా ఉంటున్నారు. పోలీసులు కష్టపడి పట్టుకొన్న వారినీ వదిలిపెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి.. స్టేషన్‌లో ఉన్న ఆర్థికనేరగాళ్లను విడిపించుకు వెళుతున్నారు. వైఎస్సార్ జిల్లా వల్లూరులోనూ ఇదే తంతు జరిగింది.
వైఎస్సార్ జిల్లాకు చెందిన వైసీపీ నేత విశ్వనాథరెడ్డి ఆర్థిక నేరాలపై అందిన ఫిర్యాదులతో.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే పోలీసుల చర్యను అడ్డుకుని.. విశ్వనాథరెడ్డిని స్టేషన్ నుంచి విడిపించుకువెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిన ఈ వ్యవహారం.. శనివారం వెలుగులోకి వచ్చింది. వల్లూరు మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన పి.విశ్వనాథరెడ్డి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది నుంచి అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులు తిరిగి చెల్లించకపోవడం, వ్యాపార లావాదేవీల్లో మోసాలను.. కొంతమంది ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు.
ఓ కీలక ఎంపీకి కూడా విషయాన్ని చేరవేశారు. బాధితుల్లో ఓ సినీనటుడి సోదరి కూడా ఉన్నారు. ఆమెకు రూ.4 కోట్ల 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. పలువురు బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెక్ బౌన్స్‌కు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం పేషీ, ఎంపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. పరారీలో ఉన్న విశ్వనాథరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కడప సమీపంలోని సీకే దిన్నె పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే వెంటనే రంగప్రవేశం చేశారు. విశ్వనాథరెడ్డిని అరెస్టు చేస్తే రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందంటూ పోలీసులపై ఒత్తిడి చేసి.. స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయినట్లు సమాచారం. సీఎం పేషీ, ఎంపీ చెప్పినా.. క్రియాశీలక ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి నిందితుడిని పోలీసులు వదిలేశారు. ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెనకేసుకురావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.