Police Raids Cockfight Bases in Eluru District: కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడులు.. ఓ కారుపై అధికార పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్ - Cockfight in Dendulur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 4:13 PM IST
Police Raids Cockfight Bases in Eluru District:ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆయిల్ పామ్ తోటలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించారు. దెందులూరు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల నుంచి పందెం రాయుళ్లు భారీగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సెబ్ అధికారులతో సహా సోదాలు నిర్వహించారు. పోలీస్ వాహనాల సైరన్లు విని చాలా మంది అక్కడ నుంచి పరారయ్యారు. దాడిలో పట్టుబడిన జూదరులను పెదవేగి స్టేషన్‌కు తరలించారు.
70 ద్విచక్రవాహనాలు, 38 కార్లు, 34 సెల్‌ఫోన్లు, 90 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారుపై స్థానిక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే పందేలు జరుగుతున్నాయన్న విమర్శలకు బలం చేకూరుతోంది. పందాలు నిర్వహించే ప్రాంతంలో జనరేటర్ సాయంతో ప్లడ్ లైట్ల వెలుగులో భారీగా పందాలు నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న జూద క్రీడల్లో తొలిసారిగా పెద్ద మొత్తంలో పందెం రాయళ్లు, వాహనాలు పట్టుబడటం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు.