CM camp office: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. కారణమిదే..! - గుంటూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
CM camp office: ఆదివాసీ మేధావుల సంఘం నిరసన నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎంక్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు వదులుతున్నారు. ఆంక్షల అమలుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలేం జరిగిందంటే?..
వాల్మీకి, బోయలను ఎస్టీ కులంలో చేర్చడాన్ని నిరసిస్తూ.. ఆదివాసీ మేధావుల సంఘం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గత అసెంబ్లీ సమావేశాలలో బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ.. తీర్మానం చేసింది. కాగా దీన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆదివాసీ మేధావుల సంఘం సోమవారం తమ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తాడేపల్లిలో సీఎం నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ప్రజల రాకపోకలను మళ్లిస్తున్నారు. పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలతో స్థానికులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.