Police Revealed ప్రయాణికుల్లా ఎక్కి హత్య చేసి.. రూ.40 లక్షల ఐరన్ లోడ్‌తో పరారీ! చివరికి చిక్కారిలా..! - Vizianagaram news
Police solved Gotlam railway track dead body case: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం రైల్వేట్రాక్‌పై ఈ నెల 13 వ తేదీన అనుమానస్పద స్థితిలో పడి ఉన్న మృత దేహానికి సంబంధించిన కేసుని బొడ్డపెల్లి పోలీసులు ఛేదించి హత్యకేసుగా నిర్ధారించారు. రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న లారీ డ్రైవర్ జగదీష్ యాదవ్ రాయగడ నుంచి విజయనగరం వైపు సుమారు 40 లక్షల విలువైన ఐరన్ లోడ్‌తో వస్తున్నాడు. మార్గ మధ్యలో ప్రయాణికులమని లారీ ఎక్కిన ఐదుగురు వ్యక్తులు పథకం ప్రకారం జగదీష్ యాదవ్‌ను లొబరుచుకుని మద్యం తాగించారు. అనంతరం లారీని గొట్ల మీదగా బొండపల్లి వరకు తీసుకెళ్లి అక్కడ హత్య చేసి జగదీష్‌ను రైలు పట్టాలపై పడేసి నిందితులు ఐరన్ లోడ్ లారీతో పరారైయ్యారు.. కేవలం రైలు ప్రమాదంలో చనిపోయినట్లు నిర్ధారించే విధంగా చిత్రీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. లారీ కదలికకు సంబంధించి జీపీఎస్ ట్రాకింగ్ చేసుకుంటూ.. ఆ లారీ ఎక్కడెక్కడ ఆగిందనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. గొట్లాం వద్ద 20 నిమిషాల పాటు ఆగి ఉండడాన్ని గమనించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. నిందితుల్లో హరీశ్వరరావుతో పాటు మరో అయిదుగురు వ్యక్తులు.. ఈ ఐరన్ లారీని దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు రూ.40 లక్షల విలువైన లారీని స్వాధీన చేసుకొని, హత్యకు సహకరించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చీపురుపల్లి డీఎస్పీ చక్రవర్తి వెల్లడించారు. ఐదుగురు నిందితులును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.