Illegal soil mining: నిల్వ చేసిన మట్టినీ వదలని అక్రమార్కులు.. వాహనాలు సీజ్ - AP Latest News
Illegal soil mining: రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమ మట్టి తవ్వకాలే కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండ ఉండటంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు.. మట్టిని అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లు, రెండు జేసీబీలను పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలో నిర్మాణం కోసం నిల్వ చేసిన మట్టిని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలేనికి చెందిన కొందరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా రాత్రివేళలో అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు.. మట్టిని తవ్వి లోడ్ చేస్తున్న రెండు జేసీబీలను, మట్టి తరలిస్తున్న ఐదు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని అరెస్టు చేశామని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్ బాబు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారన్నారు. అయితే ఆ లారీలు, జేసీబీలు ఎవరివి అనేది ఇంకా తెలియలేదు.. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.