Police over action: సీఎం సభలో పోలీసుల అత్యుత్సాహం.. రైతు ద్విచక్రవాహనాన్ని కాలితో తన్ని.. - పోలీసులు అత్యుత్సాహంపై వార్తలు
Police over action in CM Jagan meeting: సీఎం జగన్ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర వేసేందుకు ఏర్పాటు చేసే సభలు.. సామాన్య ప్రజలు, కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సీఎం జగన్ పర్యటన అంటేనే ఆయా జిల్లాల ప్రజలు ఉలిక్కిపడే విధంగా సీఎం భద్రత, ఇతరత్రా ఏర్పాట్లు ఉంటున్నాయి. సీఎం వచ్చి వెళ్లే వరకు స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. అదే సీఎం సభకు వెళ్తే మాత్రం గేట్లకు తాళాలు వేయడం.. గోడలు దూకడం లాంటి పరిస్థితులు గతంలో చూశాం. అయితే, పల్నాడు జిల్లా క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నంలో పల్నాడుకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఆవేశంతో రైతు ద్విచక్రవాహనాన్ని కాలితో తన్నగా... బైక్ కిందపడిపోయింది. ఊహించని పరిణామంతో ఆ రైతు విస్తుపోయాడు. అదేవిధంగా ఎండ వేడిమికి చెట్ల కింద సేద తీరిన రైతులను పోలీసులు ఇబ్బందులు పెట్టారు. చెట్ల కింద పడుకోరాదంటూ వారిని వెళ్లగొట్టారు. చేసేదేమీలేక రైతులు నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెనుదిరిగారు. సీఎం సభలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.