Police Cases on TDP Leaders For Protest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు.. కేసులు నమోదు చేస్తున్న పోలీసుల - ఏపీ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 3:13 PM IST
Police Cases on TDP Leaders For Protest: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును (Chandrababu Arrest) నిరసిస్తూ ఆందోళనలు చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలపై పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బంద్ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా 18 మందిపై విజయవాడలోని కృష్ణలంక పోలీసులు 151 సీఆర్పీసీ సెక్షన్ కింద నమోదు చేశారు. నెల్లిబండ్ల బాలస్వామి మరో 12 మందిపై గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు కట్టారు. గొట్టుముక్కల రఘు, గద్దె అనురాధ మరో 10 మందిపై సూర్యారావుపేట పోలీసులు కేసులు పెట్టారు. నున్న పోలీస్ స్టేషన్లో మొత్తం 27 మందిపై 151 సీఆర్పీసీ కింద పెట్టి కేసులు నమోదు చేశారు. మైలవరంలో బంద్ సందర్భంగా 12 మంది టీడీపీ కార్యకర్తలపై ఐపీసీ 341, 143, 188 సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై పమిడిముక్కలలో రెండు, తోట్లవల్లూరులో ఒక కేసు నమోదయ్యింది. ఉయ్యురు పట్టణంలో బంద్ సందర్బంగా 13 మందిపై 151 సీఆర్పీసీ కింద పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.