Police Case Filed on EX Minister Bandaru: బండారు నివాసం వద్ద ఉద్రిక్తత... పోలీసులపై తిరగబడ్డ టీడీపీ శ్రేణులు - బండారు సత్యనారాయణ x మంత్రి రోజా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 2:48 PM IST
|Updated : Oct 2, 2023, 6:46 PM IST
Police Case Filed on EX Minister Bandaru: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపై.. బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఓ వైసీపీ నేత ఫిర్యాదుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లాలోని ఆయన ఇంటిని మోహరించి.. పలు ఆంక్షలతో ఉదయం నుంచి మీడియాను అడ్డుకున్నారు.
బండారుకు మద్దతుగా కదిలి వచ్చిన మహిళలు: బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేస్తే ఊరుకోం అంటూ మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజాకు రాజకీయ జీవితం ఇచ్చిందే చంద్రబాబు అని, ఆవిషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులంతా ఏమయ్యారని ప్రశ్నించారు. బండారు సత్యనారాయణమూర్తికి మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. ఆయన కోసం రాత్రి నుంచి బండారు ఇంటివద్దే ఉన్నామని తెలిపార. పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మహిళలు ఆరోపించారు. మీరు తిడితే నీతులా.. మేం తిడితే బూతులా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతల ఆందోళన: బండారు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహార దీక్ష చేస్తున్న బండారుకు వైద్యపరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు అంబులెన్స్ తెచ్చారు. ప్రైవేట్ అంబులెన్స్‌ను లోపలకు పంపేందుకు పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులతో వెలగపూడి, వేపాడ, పల్లా, పీలా గోవింద్.. తదితర నేతలు వాగ్వాదానికి దిగారు. వెన్నెలపాలెంలో బండారు ఇంటికి వచ్చిన అయ్యన్నపాత్రుడు సంఘీభావం తెలిపారు. ఎక్కడపడితే అక్కడ 144 సెక్షన్ పెడుతున్నారని ఆరోపించారు. బండారు భార్య పరవాడ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని ఆమె ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని.. కనీసం రసీదు ఇవ్వలేదని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే... టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పర్యాటకశాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ వ్యక్తిగత దూషణలు చేశారంటూ.. వైసీపీ కార్యకర్త మంజుల చేసిన ఫిర్యాదు మేరకు పోలీలు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఫిర్యాదు అందగా.. అక్టోబర్ 1న కేసు నమోదు చేసినట్లు సమాచారం. బండారు సత్యనారాయణపై పలు సెక్షన్లతో పాటు.. ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బండారు సత్యనారాయణను విశాఖలో అరెస్టు చేసి గుంటూరు తీసుకువచ్చే అవకాశముందని సమాచారం. దీనికోసం గుంటూరు పోలీసులు విశాఖ వెళ్లారు. అనకాపల్లి జిల్లా వెన్నెల పాలెంలోని ఆయన నివాసం వద్ద సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. ఆయన నివాసం వద్దకు మీడియా వెళ్లకుండా అంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అక్కడికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.