Police Broke the Amarana Dheeksha: బుక్కరాయసముద్రంలో ఉద్రిక్తత.. ఎంఎస్ రాజు ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 10:39 PM IST
Police Broke the Amarana Dheeksha: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. గతకొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు, ఆమరణ దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు ఆమరణ నిరాహార దీక్ష శిబిరాలపై దాడులు చేసి, నేతలను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో తెలుగుదేశం చేపట్టిన దీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.
MS Raju Amarana Deeksha Bhagnam:చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దీక్షా శిబిరాన్ని చేరుకున్న పోలీసులు.. దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, శ్రేణులు మధ్య తీవ్ర వాగ్వాదాలతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఎంఎస్ రాజును ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ''30 రోజులుగా చంద్రబాబును జైలులో అక్రమంగా నిర్బంధించారు. ఆయన చేయని తప్పుకు ఇలా శిక్షించడం బాధాకరం. జగన్ రెడ్డి కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని ఎంఎస్ రాజు అన్నారు.