సీఎం సభలో నిరుద్యోగుల నిరసన.. యువకుడిని చితకబాదిన పోలీసులు - Annual Employment Calendar
Unemployed protest in Jagan meeting: ఉద్యోగాలు కల్పించాలని జగన్ను కలిసేందుకు వచ్చిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన సీఎంకు.. తమ బాధలు చెప్పుకునేందుకు యత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని.. ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని యువకులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేవని.. ఓ గిరిజన యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
యువకుడిని చితకబాదిన పోలీసులు.. సీఎం జగన్ మీటింగ్కు వచ్చిన ఓ యువకుడిపై పోలీసులు దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు.. రైతు భరోసా కార్యక్రమం కోసం జగన్ కర్నూలు జిల్లాలోని పత్తికొండకు వచ్చారు. ఈ సందర్భంగా గ్యాలరీలో ఉన్న ఓ వైసీపీ కార్యకర్త బారికేడ్లు దాటేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో యువకుడికి, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు అందరూ కలిసి యువకుడిని నిర్ధాక్షిణ్యంగా కొట్టారు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.