ఈ నెల 16న సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన - IRS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 10:45 PM IST
PM Modi Will Inaugurate NACIN: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న రాష్ట్రానికి రానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్ (National Academy of Customs, Indirect Taxes and Narcotics)ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా నాసిన్ సంస్థ వద్ద జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్, భద్రత, సమావేశ స్థలం, నాసిన్ ఆవరణంలో పరిస్థితులు తదితర విషయాలను పరిశీలించారు. అదే విధంగా నాసిన్ అధికారులతో చర్చించారు. వారి వెంట సంయుక్త కలెక్టర్ అభిషేక్‌కుమార్, పెనుకొండ సబ్‌కలెక్టర్ అపూర్వభరత్, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ ఇతర అధికారులు ఉన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేంద్రం నాసిన్, బెల్ సంస్థలను ప్రకటించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్ నిర్మాణం పూర్తై, ప్రారంభానికి సిద్ధమైంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికైన వారికి ఈ సంస్థలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో సంస్థ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS) కింద ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ప్రధానమంత్రి పర్యటన ఖరారు కావడంతో సంస్థ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.