Plots Allotment Dispute in Bapatla: ఇళ్ల స్థలాల పంపిణీ.. వైసీపీ వర్గాల మధ్య వివాదం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ - మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
Plots Allotment Dispute in Bapatla District: పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలోని వివేకానంద కాలనీ సమీపంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు సకాలంలో స్పందించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివేకానంద కాలనీ సమీపంలో వంద మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి సిద్ధం చేసిన అధికారులు.. భూమిని చదును చేసి హద్దురాళ్లు వేశారు. అయితే సోనను పూడ్చి ప్లాట్లు వేస్తున్నారని అక్కడి రైతులు కొంతమంది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. తన అనుచరులతో ఆ స్థలంలో కుర్చీ వేసుకుని బైఠాయించారు. దీంతో సొన పొరంబోకు భూముల వద్ద ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2003లో స్థానికంగా సోన పోరంబోకు ఆనుకోని ఉన్న మూడున్నర ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు కేటాయించింది. అర్హులైన లబ్ధిదారులకు స్థలాన్ని కేటాయించే క్రమంలో సోన పోరంబోకు స్థలంలోనూ నివేశన స్థలాలు కేటాయిస్తుండడంతో వివాదం నెలకొంది. వివాదంపై సత్వరమే విచారణ జరిపి పరిష్కరిస్తామని వేటపాలెం తహసీల్దార్ అశోక్ వర్ధన్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.