Person Cheats People of Worth of Rs 7 Crores in Anantapur: అనంతలో చిట్టీల పేరుతో మోసం.. రూ.7 కోట్లకు కుచ్చుటోపి - A Person is Cheating People With Chitti
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 8:37 PM IST
Person Cheats People of Worth of Rs 7 Crores in Anantapur: చిట్టీల పేరుతో అనంతపురంలో ఓ వ్యక్తి కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టాడు. రామాంజనేయులు అనే వ్యక్తి చిట్టీల పేరుతో తమను మోసం చేశాడంటూ బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రామాంజనేయులు చిట్టీల పేరుతో వసూలు చేసి, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు.
గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ.. ఆసుపత్రికి వస్తున్న రోగుల బంధువులను పరిచయం చేసుకుని వారి నుంచి చిట్టీలు వేయించడం ప్రారంభించాడు. ఇలా దాదాపు 200 మంది నుంచి చిట్టీలు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.6 నుంచి 7 కోట్ల వరకు చిట్టీల డబ్బులు బాధితులకు ఇవ్వాల్సి ఉందని తమకు తెలిసిందన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని తమ డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు బాధితులు తెలిపారు.