మరోసారి ఏలూరు కలెక్టర్‌పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం - ఎందుకంటే ? - పేర్ని నాని ప్రసన్న వెంకటేష్ వివాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 7:11 PM IST
Perni Nani Fires on Eluru District Collector: కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరగ్గా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావటంతో పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలంటే లెక్కలేని తనంతో ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ కమిటీ సమావేశం పేరుతో గైర్హాజరు కావటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రాధాన్యత కలిగిన జడ్పీ సమావేశానికి కలెక్టర్ రాకుండా, కింది స్థాయి అధికారులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు.
ఇదేమీ మొదటి సారి కాదు:ఏలూరు జిల్లా కలెక్టర్‌పై పేర్ని నాని మండిపడటం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో కూడా ఇదే విధంగా జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ హాజరు కాలేదు. అప్పుడు కూడా పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇది సీఎంవో వరకూ వెళ్లింది. తాజాగా మరోసారి ఇదే విధంగా జరగడంతో.. కలెక్టర్, పేర్ని నాని మధ్య వివాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.