మంచు కురిసే వేళ - మది పులకరించగా - మంచుతో ఇబ్బందులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 11:46 AM IST
People Suffer With Snow :వాతావరణంలో జరుగుతున్న మార్పులతో మైదాన ప్రాంతాలు మన్యాన్ని తలపిస్తున్నాయి. అనకాపల్లిలోని పల్లెలు ప్రకృతి సోయగాల మధ్య మంచు దుప్పటి కప్పుకొని ఆహ్లాదకరంగా మారాయి. భానుడు బారెడు పొద్దెక్కినా మంచు మాత్రం తగ్గటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ఉదయం వేళ కూడా లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. మంచు గ్రామాలను కప్పివేయడంతో చలికి పిల్లలు, వృద్ధులు తట్టుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. చలి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ మంచు ముసుగు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పల్లె అతిథులకు మంచు బిందువుల స్వాగతం : సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబంతో ఆనంద, ఆహ్లాదాలతో జరుపుకోవడానికి పట్టణాల్లో స్థిరపడిన వారు పల్లెలకు వచ్చారు. పల్లె అతిథులకు ముత్యాలుగా మారిన మంచు బిందువులు స్వాగతం పలికాయి. పంట పొలాలు ఆ మంచు అందాలతో మమేకమై సహజ సౌందర్యాన్ని కళ్లకు కడుతున్నాయి. హిమ బిందువులు ముత్యాలుగా మారి పచ్చని పైరును హత్తుకున్న దృశ్యాలు వారికి హత్తుకున్నాయి. మంచు బిందువుల చక్కని దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించి ఆనందించారు.