CM Jagan Kavali Sabha: సీఎం జగన్ కావలి సభలోనూ అదే సీన్.. వీడియో వైరల్ - cm jagan kavali sabha news
AP CM Jagan Kavali Sabha latest news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. గత కొంతకాలంగా ఏ జిల్లాల్లో బహిరంగ సభను నిర్వహించినా.. సభకు విచ్చేసిన ప్రజలు ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో అధికారులు, పార్టీ ముఖ్య నాయకులు వారిని కట్టడి చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకనొక సమయంలో అధికారులు సభ నుంచి ప్రజలు వెళ్లిపోకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తే.. గొడలు, గేట్లపై నుంచి దూకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో ఈరోజు నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ గత సభల్లో జరిగిన సీనే రిపీట్ అయ్యింది. ఓవైపు ముఖ్యమంత్రి జగన్ గొంతెత్తి ప్రసంగిస్తుండగా మరోవైపు ప్రజలు సభ నుంచి వెళ్లిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చుక్కల భూములకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ.. రైతన్నలకు ఆ భూముల (చుక్కల భూముల)పై సంపూర్ణ హక్కులను కల్పించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా సీఎం సభ కోసం అధికారులు, నాయకులు తెగ హంగామా చేశారు. ఈ క్రమంలో బహిరంగ సభకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, సభలో ఎండ వేడికి తట్టుకోలేక అనేక మంది చెట్లకిందే సేద తీరారు. సభలో ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగానే ఎక్కువ మంది మధ్యలోనే వెళ్లిపోయారు.
దీంతో లోపల కుర్చీలన్నీ ఖాళీగా ఉండడంతో.. బయట ఉన్నవారంతా లోపలకు రావాలని అనేకసార్లు మైకులో విజ్ఞప్తి చేశారు. ఓ వైపు ఎండ మరోవైపు ఆకలి, దాహంతో విలవిల్లాడిన ప్రజలు.. నడుచుకుంటూ ఆర్టీసీ డిపోకి వెళ్లిపోయారు. అయితే, సీఎం సభ ముగిసే వరకూ ఉదయగిరి, కందుకూరు వైపు వాహనాలు రాకుండా, దుకాణాలను మూయించేశారు. జగన్ వేదికపైకి వచ్చేవరకూ కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీంతో నిర్వాహకులు బయట రోడ్లమీద ఉన్న ప్రజలను వేదిక వద్దకు రావాలని అనేకసార్లు మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. అయినా వచ్చిన వారంత చెట్ల కింద కుర్చుని విశ్రాంతి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఎండ తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో సీఎం వేదికపైకి రాగానే.. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడటం ప్రారంభించారు. దీంతో సభకు వచ్చిన మహిళలు ఇళ్లకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. జగన్ మాట్లాడం ప్రారంభించగానే ఎక్కువ మంది సభ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. తాగడానికి నీరు లేక, తినడానికి తిండిలేక, ఎండ తీవ్రతకు తట్టుకోలేక సభకు విచ్చేసిన ప్రజలు నానా అవస్థలు పడ్డారు.