CM Jagan Guntur Tour: కారైనా.. హెలికాఫ్టరైనా.. జగన్ వస్తే ఆంక్షలు కామనే - condolence to MLA Maddali
CM Jagan Tour Problems: సీఎం జగన్ పర్యటన అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఆయన రోడ్డు మీద ప్రయాణించినా, గాల్లో ప్రయాణించినా అవే ఆంక్షలు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం.. సీఎం జగన్ హెలికాప్టర్లో రాగా.. అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం-పలాస జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ ఘటనపై చాలానే విమర్శలు వచ్చాయి. అది మరువక ముందే తాజాగా గుంటూరు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది.
ముఖ్యమంత్రి జగన్.. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి గుంటూరు పరేడ్ మైదానానికి హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే గిరిధర్ ఇంటికి రోడ్డు మార్గాన వచ్చారు. గిరిధర్ తల్లి శివపార్వతి ఇటీవల చనిపోయారు. ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తిరిగి పరేడ్ మైదానానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లికి చేరుకున్నారు. అయితే సీఎం జగన్ పర్యటన ఎక్కడైనా పోలీసుల ఆంక్షలు కామన్ అయిపోయాయి. ఆయన రోడ్డు మార్గాన పయనించినా.. హెలికాఫ్టర్ ద్వారా వచ్చినా సేమ్ రూల్స్ అన్నట్లు ఉంది పరిస్థితి. ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరిన వెెంటనే మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు.. మద్దాలి కుటుంబసభ్యులను పరామర్శించి తిరిగి తాడేపల్లికి చేరే వరకూ ఆ ఆంక్షలు కొనసాగాయి. ఈ ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. జడ్పీ కార్యాలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేశారు. కార్యాలయానికి వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.