CM Jagan Tour: పరదాల మధ్య సీఎం జగన్ పర్యటన.. మళ్లీ ప్రజలకు తప్పని తిప్పలు - పరదాల మధ్యే సీఎం పర్యటన
People Problems With CM Jagan Tour: ముఖ్యమంత్రి గుంటూరు నగర పర్యటన పరదాల మధ్యే సాగింది. ఎవరికి కనపడకుండా.. సీఎం వెళ్లే మార్గం మొత్తం బారికేడ్లు, వైసీపీ రంగులతో కూడిన పరదాలు కట్టారు. ట్రాక్టర్లు పంపిణీ చేసే చుట్టుగుంట కూడలి వద్ద భారీ భవనాలు, కొన్ని అపార్ట్మెంట్‌లకు పరదాలు చుట్టేశారు. ఇళ్లలో వారిని బయటకు రానీయలేదు. యంత్ర సేవా పథకం లబ్ధిదారులకు పోలీసులు చుక్కలు చూపించారు. రాత్రి 9 గంటలకే.. ట్రాక్టర్లు రోడ్డుపై క్యూ లైన్లో పెట్టించారు. ఉదయం 6 గంటల నుంచి.. వాహనం సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. సీఎం జగన్ వచ్చి జెండా ఊపే వరకూ.. వారు వాహనాలపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. కదలకుండా, మెదలకుండా నాలుగున్నర గంటల పాటు అలా ఎండలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలవడంతో.. చాలా మంది నీరసించిపోయారు.
మరోవైపు ముఖ్యమంత్రి గుంటూరు పర్యటన నేపథ్యంలో కీలకమైన మార్గాలో రాకపోకలు బంద్ చేయడంతో ఎటు వెళ్లాలో తెలియక జనం తీవ్ర అవస్థలు పడ్డారు. కలెక్టరేట్, పోలిస్ పేరేడ్ గ్రౌండ్స్, చుట్టుగుంట ప్రాంతాలన్నీ ఆంక్షలు అమలు చేయడంతో వాహానదారులకు అవస్థలు తప్పలేదు. ఉదయం ఆఫీస్‌లకు, వివిధ పనులకు బయటకు వెళ్లే వారు ఎక్కడిక్కడ అడ్డుగా పెట్టిన బారికేడ్లతో గందరగోళానికి లోనయ్యారు. పోలీసులు వాహనాలను అనుమతించిన మార్గాల వైపు సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు వాహానాల మళ్లింపుతో ప్రజలకు చికాకులు తప్పలేదు. ముఖ్యమంత్రి తొమ్మిదన్నరకు వస్తారని తెలిసినా.. ఉదయం ఆరు గంటలకే ఆంక్షలు అమలు చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.