Damaged Roads: అధ్వానంగా రహదారులు.. గుంతల్లో అదుపుతప్పిన లారీ.. కర్రలే ఆధారం..!
People Face Problems With Damaged Roads: రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే గుంతలుపడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మన్యం జిల్లాలోని పార్వతీపురం నుంచి కొమరాడ మండలంలోని కూనేరు వరకు ఉన్న రాష్ట్ర రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. గుంతలు పడిన ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనాదారులు బెంబేలెత్తుతున్నారు. నిన్న కొమరాడ, బంగారంపేట మధ్య గోతుల్లోపడి రెండు లారీలు నిలిచిపోయాయి. దీంతో సుమారు గంటన్నరపాటు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే దారిలో ఆర్తం వద్ద కర్రల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో లారీ కిందకు పడిపోకుండా కర్రలను దన్నుగా పెట్టారు. దీనివల్ల సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. గుంతలు పడిన ఈ రహదారుల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.