People Agitation for Pension: తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. పింఛన్ బాధితుల ఆందోళన - గుంటూరులో పింఛను లబ్ధిదారుల ఆందోళన
People Agitation for Pension: అర్హతలున్నా పింఛను మంజూరు చేయడం లేదంటూ గుంటూరు 19వ వార్డులోని సచివాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అన్ని అర్హతలుండి కూడా తాము వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చుట్టూ తిరుగుతున్నామని.. అయినా తమకు పింఛను మంజూరు చేయడం లేదని లబ్ధిదారులు తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీ మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ ఉద్యోగుల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. తనకు ఎప్పటి నుంచో వస్తున్న దివ్యాంగ పింఛను తీసేశారని ఓ బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా తనకు పింఛన్ మంజూరు చేయటం లేదని వెలగ సుబ్బాయమ్మ అనే వృద్ధురాలు ఆరోపించింది. తల్లిదండ్రులు మరణించిన పెదాల రాజు అనే పిల్లాడిని తన మేనమామ రేషన్ కార్డులో చేర్చేందుకు జనన ధ్రువీకరణ పత్రం లేదని తిప్పుతున్నారని బాలుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే పింఛన్ల తొలగింపు, మంజూరు ప్రక్రియ చేపడుతున్నామని సచివాలయ సిబ్బంది తెలిపారు.