రెండు నెలలుగా నిలిచిపోయిన గుంటూరు- కాచిగూడ రైలు - ప్రయాణికుల అవస్థలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 11:04 AM IST
People Facing Problems Due to Guntur Kacheguda Train Cancelled: గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రద్దుతో గిద్దలూరు, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. డబ్లింగ్ పనుల కారణంగా రైల్వే అధికారులు ఈ రైలును పలుమార్లు రద్దు చేస్తూ ఇప్పటివరకు కొనసాగించారు. ఈ విధంగా రెండు నెలలుగా రైలును నిలిపివేశారు. ఈ విధంగా రైలు రద్దును కొనసాగించడంతో గిద్దలూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.
ట్రైన్ రద్దు చేయడంతో ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఒక్కరికి దాదాపుగా 2 వేల రూపాయల ఖర్చు అవుతుందని, అదే ఒక ఫ్యామిలీ వెళ్లాలంటే సుమారు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఉపాధి కోసం నిత్యం రైలులో వెళ్లే ప్రయాణికులు సైతం ఖర్చులు భరించలేక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. గిద్దలూరు మీదుగా వెళ్లే మిగతా రైల్లు నడుస్తున్నప్పుడు గుంటూరు- కాచిగూడ రైలు ఎందుకు రద్దు చేశారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ రైలును నడపాల్సిందిగా కోరుతున్నారు.