పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో.. ఆకట్టుకున్న 90 అడుగుల ప్రభ - sri Tirupatamma Chinna Thirunallu
Penuganchiprolu Tirupatamma Utsavam: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో భాగంగా శుక్రవారం రాత్రి 90 అడుగుల ఇనుప ప్రభ ఉత్సవం ఘనంగా జరిగింది. చిన్న తిరునాళ్లలో.. ప్రభను ఆలయం చుట్టూ ప్రదక్షణ చేయించడం పూర్వకాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన ప్రభపై తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందుగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన ఎడ్ల జతలతో ప్రభను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. భారీ ప్రభను ముందుకు లాగేందుకు పలువురి ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. వేలాది మంది భక్తులు ప్రభను ముందుకు లాగుతూ తిరుపతమ్మ, గోపయ్య స్వాములను భక్తిపారవశ్యంతో స్తుతించుకున్నారు. అంతకు ముందు గ్రామదేవతల సంప్రదాయం ప్రకారం క్రతువులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చెన్నకేశవ రావు, ఈవో లీలా కుమార్, ఈఈ వైకుంఠ రావు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.