ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్‌పై నడిస్తే పంట నష్టం ఎలా తెలుస్తుంది: పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 6:50 PM IST
PCC President Gidugu Rudraraju Fires On YCP Government: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ రహదారులపై, రెడ్ కార్పెట్లపై నడిస్తే పంట నష్టం ఎలా తెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. మిగ్జాం తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను రుద్రరాజు పరామర్శించారు. నీటిలో నానుతున్న పంటలను పరిశీలించారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించామన్నారు. మరో వంద రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరవు లేదని చెప్పేందుకే జగన్ ఇంత వరకు కరవు మండలాలను ప్రకటించలేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేలు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కర్నాటక, తెలంగాణ తరహాలోనే ఇక్కడ పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని రుద్రరాజు అన్నారు.