Payyavula fire on CM Jagan: రాయలసీమ వనరులను జగన్ ప్రభుత్వం ఏటీఏంలా వాడుకుంటోంది : పయ్యావుల - అసైన్డ్ భూమి
Payyavula Keshav's allegations against Jagan's government: రాయలసీమ వనరులను జగన్ ప్రభుత్వం ఏటీఏంలా వాడుకుంటోందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అవినీతి, దోపిడీ కోసం జగన్ ప్రభుత్వం రాయలసీమను వినియోగించుకుంటోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతల కోసమే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూముల బాగోతంపై అసెంబ్లీలో ఏ స్థాయిలో చర్చ జరిగిందో అందరికీ తెలుసన్న కేశవ్.. పేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయన్నారు. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.300 కోట్ల దోపిడీ యథేచ్ఛగా జరిగిందని.. తాడేపల్లి ఖజానాకు ఇసుక దోపిడీ సొమ్ము రూ.12 వేల కోట్లు చేరాయని ఆరోపించారు. ఎన్జీటీ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కేశవ్.. ఏపీలో సామాన్యునికి ఇసుక దొరకకుండా పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో 900 కోట్లు భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ప్రభుత్వ మౌనం స్కాం జరిగిందన్న తన ఆరోపణలకు అంగీకారంగా భావించాలా అని పయ్యావుల ప్రశ్నించారు. పక్కదారి పట్టిన రూ.900 కోట్ల వినియోగిస్తే.. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయ్యేవని, కొట్టుకుపోయిన అన్నమయ్య, పులిచింతల గేట్లు బిగించగలిగేవారని తెలిపారు.