Rape Attempt: ఇంట్లో పని ఉందంటూ వివాహితను పిలిచిన పాస్టర్.. ఆ తర్వాత ఏమైందంటే.! - నెల్లూరులో మహిళపై అత్యాచారయత్నం
Rape Attempt: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో గిరిజన మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అయితే స్థానికంగా ఉన్న చర్చి పాస్టర్ ఐజయ్య ఇంట్లో పని ఉందంటూ తనను తీసుకువెళ్లి అత్యాచారం చేయబోయాడని బాధితురాలు తెలిపింది. దైవ సహాయకులుగా ఉన్న పాస్టర్ ఇలాంటి పనులు చేయడం ఏమిటని ఆ వివాహిత కన్నీళ్లతో వేడుకున్నా.. అతడు కనికరించకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుని.. బయటపడినట్లు ఆమె తెలిపింది. దీంతో పాటు ఈ ఘటనను ఎవరికైనా చెబితే.. తనని, తన భర్తని చంపేస్తానంటూ పాస్టర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొంది. ఈనెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన పై కుటుంబ సభ్యులు ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామ సర్పంచ్ శీనయ్య ఈ ఘటనపై రాజీ కుదుర్చే పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసుల తీరుపైనా విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు వారిపై విచారణకు ఆదేశించారు. జిల్లా ఇంఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో బాధితురాలిని విచారించారు. అనంతరం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పిన డీఎస్పీ, స్థానిక పోలీసుల తప్పుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే పాస్టర్ ఐజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.