గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన - సిబ్బందితో వాగ్వాదం - Passengers concern at airport for luggage
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 10:38 PM IST
Passengers Agitation at Gannavaram Airport: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనలు చేపట్టారు. కువైట్ నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరం ఎయిర్ పోర్టుకి శనివారం ఉదయం 11 గంటలకు ప్రయాణికులు చేరుకున్నారు. వారిలో 10 మంది బ్యాగులు కనిపించలేదు. దీంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి ఉన్నా తమ లగేజీ బ్యాగులు ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని, కనీసం తమ లగేజీ బ్యాగులు ఇచ్చే వరకు వసతి సదుపాయం సైతం కల్పించలేదని ప్రయాణికులు మండిపడ్డారు. ఉదయం నుంచి అడుగుతున్నా అదిగో ఇదిగో అంటున్నారే కానీ లగేజీ రాలేదని ధ్వజమెత్తారు. లగేజీ వస్తుందీ అని చెప్తున్నారే కానీ ఏ సమయానికి చేరుకుంటుందనే దానిపై విమానాశ్రయ అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉదయం నుంచి వేచి ఉంటే తీరా ఇప్పుడు ఏమో ఇంటికి పంపిస్తామంటూ సిబ్బంది సమాధానం చెప్తుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.