Kotam Reddy as TDP incharge: నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోటంరెడ్డి.. ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్ష
Kotam Reddy appointed as TDP incharge: నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని.. పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే ఆరోపణలతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసింది. అంతకు ముందు నుంచే ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వస్తున్న కోటంరెడ్డి.. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కోటం రెడ్డి సోదరులు చురుకుగా పాల్గొని నియోజకవర్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొండెపి, గూడూరు, చీరాల నియోజవర్గాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించారు. గూడూరులో సునీల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదే స్థానానికి పనబాక కృష్ణయ్య టికెట్ ఆశించినందున.. ఆ కుటుంబానికి పార్టీ పరంగా తగు ప్రాధాన్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. కొండెపిలో ఈ సారి భారీ మెజార్టీ సాధించాలని నేతలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక క్యాడర్ సూచనలకే ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చీరాలలో కొండయ్య యాదవ్ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్లు సమాచారం.