100 Kg Ganja Seized: ఇద్దరు మహిళల వద్ద పట్టుబడ్డ 100కేజీల గంజాయి.. లారీ డ్రైవర్లే లక్ష్యం... - నేర వార్తలు
100 Kg Ganja Seized: ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లోని ఇచ్చాపురం-పురుషోత్తపురం జాతీయ రహదారి వద్ద వివిధ షాపుల్లో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న 100 కేజీల గంజాయి, ఒక కేజీ నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. జాతీయ రహదారిపై పాత చెక్పోస్ట్ సమీపంలో లారీ డ్రైవర్లకు అమ్మేందుకు రెండు షాపులలో గంజాయి అమ్మేందుకు నిల్వ ఉంచినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఇచ్చాపురం పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
షాపులు నిర్వహిస్తున్న మహిళల వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక పేర్కొన్నారు. ఇద్దరు మహిళల్లోని, ఒక మహిళ ఇంట్లో తనిఖీ చేయగా 87 కేజీల గంజాయి, ఒక కేజీ నల్లమందు దొరికినట్లు వెల్లడించారు. షాపులు పెట్టుకొని జీవిస్తున్న ఇద్దరు మహిళలు గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా మార్చి జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ డ్రైవర్లకు అమ్ముతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. 2019 నుంచి 2023 వరకు పోలీసులు 77 గంజాయి కేసులను నమోదు చేయగా, ఎస్ఈబీ వారు ఏడు కేసులను నమోదు చేశారని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు 11,800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని.. 232 మందికి పైగా అరెస్టు చేసినట్లు ఎస్పీ రాధిక వివరించారు. గంజాయి అక్రమ రవాణా కట్టడిలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్న ఇచ్చాపురం పోలీస్ అధికారులను ఎస్ఈబీ అధికారులను ఆమె అభినందించారు.
TAGGED:
100 Kg Ganja Seized