Class war in YCP: వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే తీరుకు ఉపసర్పంచ్ రాజీనామా
Sri Sathya Sai District: క్షేత్రస్థాయిలో అధికార వైసీపీ వర్గాల పోరు తారాస్థాయికి చేరింది. తమకు గిట్టలేదంటూ సొంత పార్టీ వారిపైనా కక్షసాధింపులకు వెనకాడలేదు. కదిరి శాసనసభ్యుడు సిద్దారెడ్డి, నల్లచెరువు మండలాధ్యక్షుడు రమణారెడ్డి తీరుకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయి పంచాయతీ ఉపసర్పంచి, వార్డు సభ్యుడితో పాటు వాలంటీర్ పదవులకు రాజీనామా చేశారు. పార్టీని నమ్ముకుని లక్షలాది రూపాయలు నష్టపోయామని ఓరువాయి ఉపసర్పంచి బయారెడ్డి వాపోయారు. చిన్న పనులు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీనీ, ఎమ్మెల్యే, ఎంపీపీని గుడ్డిగా నమ్మినందుకు చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తోందని ఉపసర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చేస్తున్న తప్పులను సరిదిద్దుకోని పక్షంలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధిలైట్లు, తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని ఆయన వాపోయాడు. గత తెలుగుదేశం పాలనలో వార్డు మెంబర్గా ఉన్నానని, అప్పుడు ఇలాంటి కక్షసాధింపులు చూడలేదన్నారు. ప్రజలతో పాటు సొంతపార్టీ వారి పైనా వేధింపులకు పాల్పడుతున్న వారి వల్ల వైసీపీకి నష్టం తప్పదన్నారు. బయారెడ్డితో పాటు మరో వార్డు సభ్యుడు, వాలంటీర్ రాజీనామాలను ఇంఛార్జి ఎంపీడీవో రామకృష్ణకు అందచేశారు.