వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. నవనీతకృష్ణాలంకారంలో స్వామివారు
Ontimitta Sri Kodandaramaswamy annual Brahmotsavam updates: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన (సోమవారం) ఉదయం రాములవారు నవనీతకృష్ణాలంకారంలో ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
ఈ నేపథ్యంలో స్వామివారి గ్రామోత్సవాన్ని ఆలయ అధికారులు వేడుకగా నిర్వహించారు. ఊరేగింపు ముందు మహిళలు, చిన్నారులు చేసిన కోలాటం ఆందరినీ ఆకట్టుకుంది. భక్తులు స్పామివారికి.. అడుగడుగునా కర్పూరహారతులను సమర్పించి, దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేపల్లెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈఓ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.