ONGC Fire: జీసీఎస్ పైపులైన్ నుంచి ఎగిసిపడ్డ అగ్ని కీలలు.. భయాందోళనలో తూర్పుపాలెం గ్రామస్థులు - అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం
ONGC Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మలికిపురం మండలం తూర్పు పాలెంలో ఈ ప్రమాదం జరిగింది. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) కేశనపల్లి జీసీఎస్ పైపులైను నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కేసనపల్లి జీసీఎస్ నుంచి నగరం జీసీఎస్ కు వెళ్లే పైపులైనులో గ్యాస్ తో పాటు క్రూడ్ ఆయిల్ సరఫరా కావడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. దీనికి ఫలితంగా గ్రామమంతా దట్టమైన నల్లని పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకుని అప్రమత్తమైన ఓఎన్జీసీ, పోలీసు అధికారులు నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడం, దానికి తోడు పైపులైన్ నుంచి మంటలు వ్యాపించడంతో గ్రామంలో వేడి అధికంగా పెరిగిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.