Land registration: న్యాయం కోసం జగన్ను కలుస్తా.. ముప్పై ఏళ్లుగా వృద్ధురాలి పోరాటం - క్రైం వార్తలు
fighting for land registration: తన పేరు మీద ఉన్న స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలంటూ 30 ఏళ్లుగా వృద్ధురాలు మునెమ్మ పోరాటం చేస్తోంది. ఈ విషయమై అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వెళ్తానని వృద్ధురాలు స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని స్థలం వద్ద వృద్ధురాలు మునెమ్మ మీడియాతో తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన మునెమ్మ తనది వీరపు నాయునిపల్లె మండలం కాగా.. 30 ఏళ్ల క్రితం పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలకు చెందిన వెంకట సుబ్బారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామచంద్రారెడ్డిలు చీటీల వ్యాపారం చేశారని... తన చెల్లితో పాటు తాను చీటీల వ్యాపారంలో సభ్యులుగా చేరామన్నారు. ఈ చీటీల డిప్లో తనకు, తన చెల్లెకు ఇంటి స్థలాలు లభించాయన్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని.. అయినా తమకు చెందిన స్థలాన్ని చీటీల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేయించలేదన్నారు. తన సోదరి చనిపోవడంతో తాను ఒంటరిగా పోరాడుతున్నట్లు పేర్కొంది. నిర్వాహకులకు వైసీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మునెమ్మ పేర్కొంది. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకుంటానని వృద్ధురాలు మునెమ్మ వాపోయింది.