Shock to Farmer: సమస్య పరిష్కారానికి 730 రోజులు.. అధికారుల నిర్లక్ష్యంపై రైతు ఆగ్రహం - Spandana Program
Spandana Program Receipt in Guntur: తన సమస్య పరిష్కరించమని స్పందన కార్యక్రమానికి వెళ్లిన రైతుకు ఊహించని షాక్ తగిలింది. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఫిర్యాదుదారులు ఇచ్చిన సమస్య ఏంటి..? ఏ శాఖ పరిధిలోకి వస్తుంది? ఏ అధికారి పరిష్కరించాలి..? సమస్య తీవ్రత ఎలా ఉంది? ఎప్పటిలోగా పరిష్కరించవచ్చు అనే వివిధ అంశాలను పరిశీలించిన తరువాత.. ఎన్ని రోజులలో పరిష్కరించగలరో గడువు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని స్పందనలో వచ్చిన అర్జీని పరిష్కరించేందుకు అప్పటికప్పుడే 730 రోజులు పడుతుందని గడువు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అధికారికి సమస్య చెప్పకముందే సిబ్బంది ఎన్ని రోజులలో పరిష్కరిస్తామనే రసీదును నేరుగా ఇచ్చేస్తున్నారు.
కాకుమాను మండలంలోని అప్పాపురం కాలవతో పాటు ఐదు, ఆరు బ్రాంచ్ కాలువల్లో.. గుర్రపు డెక్క, పూడిక కారణంగా పొలాలకు నీరు అందడం లేదు. దీంతో కాలువల్లో పూడిక తీయించాలని కోరుతూ చినలింగాయపాలేనికి చెందిన రైతు హనుమంతరావు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను జలవనరుల శాఖ పరిష్కరించాల్సి ఉంది. అయితే అర్జీని ఆంధ్రప్రదేశ్ సాగునీటి అభివృద్ధి సంస్థ కింద నమోదు చేశారు. సమస్యను 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీ నాటికి పరిష్కరిస్తామని రసీదు ఇవ్వడంతో హనుమంతురావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని వాపోయారు.