Ibrahimpatnam sub registrar office : అర్ధరాత్రి.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో.. మందు పార్టీలో మార్కెట్ వాల్యూ..! - sub registrar office midnight
Ibrahimpatnam sub registrar office : దేవాలయం లాంటి కార్యాలయాన్ని బార్గా మార్చేశారు.. రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది. ఎప్పుడు మొదలెట్టారో ఏమో గానీ, అర్ధరాత్రి కూడా ఆఫీసులోనే మద్యం సేవిస్తూ స్థానికుల కంట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా.. మద్యం మత్తులో మాట్లాడారు. మార్కెట్ విలువలు పరిశీలిస్తున్నామంటూ.. మీడియాపైనా దురుసుగా ప్రవర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది మద్యం మత్తులో అర్ధరాత్రి వరకు కార్యాలయంలో ఉండటం చర్చనీయాంశమైంది. కార్యాలయానికి తలుపులు వేసుకుని మరీ సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది మద్యం సేవిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించి అర్ధరాత్రి సమయంలోనూ అక్కడ ఉన్న సిబ్బందిని అక్కడ నుంచి వెళ్లిపోవాలనడం చర్చనీయాంశమైంది. సబ్ రిజిస్ట్రార్ ఏవీ సింగ్ మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు మార్కెట్ వ్యాల్యూ చెక్ చేస్తున్నామంటూ సమాధానమిచ్చారు. సబ్ రిజిస్ట్రార్ సహా సిబ్బంది వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.