CBN House in Kuppam: చంద్రబాబు ఇంటి నిర్మాణానికి తప్పని తిప్పలు.. అనుమతుల కోసం ఎదురుచూపు
Chandrababu House in Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి అనుమతుల మంజూరులో.. ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో ఇంటి నిర్మాణానికి గతేడాది శ్రీకారం చుట్టారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద.. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన 2 ఎకరాల్లో ముందుగా రక్షణ గోడ నిర్మాణం ప్రారంభించారు. ప్రహరీ పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. రైతుల నుంచి కొన్న పొలాన్ని నిబంధనల మేరకు కన్వర్షన్ చేపట్టి.. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతులు కోరారు. ఇందుకోసం సుమారు 6 నెలల కిందట చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పీఎంకే ఉడాకు దరఖాస్తు చేశారు.
ఉడా వర్గాల నుంచి స్పందన లేకపోవడంతో అనుమతుల కోసం న్యాయస్థానం ద్వారా నోటీసులను పంపినట్లు తెలిసింది. శివపురం వద్ద దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన నిర్మాణ పనులను చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వేర్వేరు సందర్భాల్లో పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానిక నాయకుల్ని ఆదేశించారు. ఐతే ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. దాంతో నిర్మాణ సామగ్రిని ఆరు బయట భద్రపరిచారు. అనుమతులు రాకపోవడం వల్లే నిర్మాణాలు ఆగిన విషయాన్ని చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.