ఆ ఆలయంలోకి మహిళలకు నో ఎంట్రీ - బోనాలు సమర్పించనున్న పురుషులు - sangeevaraya swamy temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 3:19 PM IST
No Entry For Women to Temple in Annamayya District: పూజా కార్యక్రమాలు, ఆలయాలు, తిరునాళ్లలో మహిళలు ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా దేవుని అలంకరణ, బోనాలు తయారు చేయటం వంటి కార్యక్రమాల్లో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ ఆ ఆలయంలోకి మహిళలు, దళితులకు నిషేధం. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం రోజు పొంగళ్లు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొని స్వయంగా పొంగళ్లు వండి స్వామివారికి సమర్పిస్తారు. ఇటువంటి భిన్నమైన ఆచారం కలిగిన ఆలయం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉంది.
గ్రామస్థులు, ఆలయ పూజరి తెలిపిన వివరాల ప్రకారం తిప్పాయపల్లె గ్రామంలో సంజీవరాయ స్వామి స్వయంబుగా వెలిశారని, ఆంజనేయస్వామి ప్రతిరూపంగా సంజీవరాయ స్వామిని పేర్కొంటారు. సంజీవ పర్వతం తీసుకువచ్చినందుకు గాను సంజీవరాయ స్వామిగా పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు. సంజీవరాయ స్వామిని గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రతిష్టించారని చెబుతున్నారు. స్వామి వారిని ప్రతిష్టించిన వృద్ధ బ్రాహ్మణుడు ఆలయానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరచి అదృశ్యమయ్యారని గ్రామస్థులు పేర్కొన్నారు. అంటు, ముట్టు ఉన్నటువంటి వారికి ఈ ఆలయంలో ప్రవేశం ఉండకూడదని నియమాన్ని విధించారు.
దీంతో దళితులు, మహిళలకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. ఆలయ ప్రహారి గోడ వద్ద నుంచే స్వామి వారిని దర్శించుకుంటామని మహిళలు పేర్కొన్నారు. స్వామి వారి ప్రసాదం కూడా మహిళలకు ఇవ్వరని తెలిపారు. కోరిన కోరికలు స్వామి వారు తీరుస్తారని ప్రజల విశ్వాసం. ఈ ఆలయానికి స్థానికులు మాత్రమే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి, వేరే ప్రదేశాల్లో స్థిరపడ్డ వారు కూడా ఈ పండుగ సమయానికి చేరుకుని పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొంటారని స్థానికులు చెబుతున్నారు.