Nirudyogi Kirana&General Stores: 'ప్రభుత్వం మీదొట్టు.. ఇది నిరుద్యోగి కొట్టు..!' యువకుడి వినూత్న నిరసన - విజయనగరం జిల్లా లేటెస్ట్ న్యూస్
Nirudyogi Kirana&General Stores: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని వంగర గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి విసిగిపోయాడు. చివరికి స్వయం ఉపాధి మేలనుకున్న ఆ యువకుడు.. 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' పేరుతో ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో ప్రభుత్వానికి తన ఆవేదనను తెలియజేశాడు. ఇంజినీరింగ్‌తో పాటు, పలు డిగ్రీలు సాధించిన దత్తి వెంకటరమణ.. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూశాడు. ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేయకపోవటంతో నిరాశ, నిస్పృహలకు గురయ్యాడు. ఇక చేసేదేంలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు తన ఇంటివద్ద 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. ఉపాధి దొరకని పరిస్థితుల్లో నిరుద్యోగుల అవస్థను ప్రభుత్వానికి తెలియజేసేందుకే దుకాణానికి ఆ పేరు పెట్టినట్లు యువకుడు తెలిపాడు.
"నేను ఐటీఐ, బీటెక్‌తో పాటు డిగ్రీ కూడా పూర్తి చేశాను. రైల్వేలో అప్రెంటీస్‌గా కూడా పని చేశాను. క్యాంపస్ సెలక్షన్లో రూ.10వేల నుంచి రూ.12వేల వరకు మాత్రమే వేతనం ఇస్తామన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆ జీతం సరిపోదు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసి.. ఇక చేసేదేంలేక ఏడాది కిందట ఈ దుకాణాన్ని ప్రారంభించాను. నా బాధ ప్రభుత్వానికి అర్థంకావాలనే ఉద్దేశంతోనే దుకాణానికి 'నిరుద్యోగి కిరాణా & జనరల్ స్టోర్స్' అని పేరు పెట్టాను." - దత్తి వెంకటరమణ, షాప్ నిర్వాహకుడు
TAGGED:
Nirudyogi frustration