ఓట్ల తొలగింపు అంశంపై సీఈఓ కలిసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ - ఓట్ల తొలగింపు అంశంపై సీఈఓ కలిసిన నిమ్మగడ్డ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 9:57 PM IST
Nimmagadda Ramesh Kumar on deletion of votes: ప్రాథమిక హక్కుగా సంక్రమించిన ఓటు హక్కుకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఈఆర్వోల వద్దే ఉంటాయని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. స్థానికత ఆధారంగా ఓటు హక్కు తొలగించే సమయంలో దాన్ని నిరూపించాల్సిన భాద్యత కూడా ఈఆర్వోదేనని వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్రంలో కొన్ని చోట్ల ఓటర్ల తొలగింపునకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఓ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు.
సీఈఓ ని కలిసిన అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. గంపగుత్తగా ఫాం 7 దరఖాస్తులు రావటం, అలాగే ఫాం 6ల నమోదు లాంటి అంశాలపై వచ్చిన అంశాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు తెలియచేసినట్టు రమేష్ కుమార్ వివరించారు. ఫాం 7 ఇచ్చి తరువాత ఫాం 10 ప్రక్రియ మెుదలవుతుందని, కానీ ఫాం10లో టైం, డేట్ రావడం లేదనే విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకువచ్చినట్లు రమేష్ తెలిపారు. ఓట్ల చేర్పులు, తొలగింపులపై సీఈఓకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. 2024 ఓటర్ల తుదిజాబితాకు సంబంధించి ఈ నెల 26తో గడువు ముగుస్తుండటంతో తక్షణం తనిఖీల ప్రక్రియను ముమ్మరం చేయాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తుకు చేశారు.