ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sarpanch_attack_on_Victims_in_Nijavalli

ETV Bharat / videos

Nijavalli Sarpanch Attack on Victims: 'మా కుమారుడిది హత్యే..' న్యాయం చేయాలన్న తల్లిదండ్రులపై సర్పంచ్​ దాడి - ap latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 10:03 PM IST

Sarpanch Attack on Victims in Nijavalli : తమ కుమారుడిని మోసం చేసి హతమార్చారని.. తమకు న్యాయం చేయాలని కోరితే వైఎస్సార్సీపీ సర్పంచ్‌ తమపైనే దౌర్జన్యానికి దిగి దాడికి పాల్పడ్డారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లికి గ్రామానికి చెందిన రాజ్​ కుమార్ గత నెల ప్రమాదానికి గురై చనిపోయాడని అతని తల్లిదండ్రులు భావించారు. కానీ ఎవరో తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారని రాజ్ కుమార్ తల్లిదండ్రులు, బంధువులు అంటున్నారు. 

అదే గ్రామానికి చెందిన కొంతమంది తమ కొడుకును మోసం చేసి కొట్టి చంపారని రాజ్ కుమార్ తల్లి  నిజవల్లి సర్పంచ్​ను ప్రశ్నించింది. తమ కుమారుడు మృతికి కారకులైన వారిని వెనకేసుకొస్తున్నారని సర్పంచ్​ని దేవీరమ్మ నిలదీసింది. దీంతో సర్పంచ్​ను ప్రశ్నించినందుకు మృతుని తల్లితో సహా పలువురిపై ఇనుప రాడ్‌తో దాడికి పాల్పడ్డారని మృతుడి మేనమామ ఈరన్న ఆరోపించారు. తలకు తీవ్రగాయాలు కావడంతో  మృతుని తల్లి దేవీరమ్మ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

గ్రామానికి చెందిన కొంతమంది తన మేనల్లుడు రాజ్‌కుమార్‌ మోసం చేసి కొట్టి చంపారని, వైసీపీ సర్పంచ్ నిందితులను వెనకేసుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కుందుర్పి పోలీస్ స్టేషన్​లో,  అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేసినట్లు  ఈరన్న తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని రాజ్ కుమార్ బంధువులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details