Newborn Kidnapped in Guntur Government Hospital: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్.. కుటుంబ సభ్యుల ఆగ్రహం - పిల్లావాడిని ఎత్తుకెళ్లిన మహిళ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 10:33 PM IST
Newborn Kidnapped in Guntur Government Hospital: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. సాయి నగర్‌కు చెందిన రోషిణి గత నెల 26వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం చేరారు. మూడు రోజుల క్రితం ప్రసవం అవ్వగా.. ఇవాళ మధ్యాహ్నం పాపను గుర్తు తెలియని మహిళ అపహరించింది. పాప తల్లిదండ్రులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పాపను మహిళ అహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. తమ పాప అపహరణకు గురైందని పేర్కొన్నారు. నిత్యం వందల మంది వచ్చే ఆసుపత్రిలో కనీస భద్రత ప్రమాణాలు కరువయ్యాయని ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. త్వరలోనే పాపను పట్టుకుంటామని తెలిపారు. పాపను మహిళ అపహరించిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.