NFHS in AP: జులై నుంచి 4 నెలల పాటు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - సిగ్మా రీసెర్చ్ సంస్థ
National Family Health Survey: రాష్ట్రవ్యాప్తంగా జులై నుంచి నాలుగు నెలల పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరగనుంది. ప్రజల ఆరోగ్యం, వ్యాధులు, వైద్యానికి చేస్తున్న ఖర్చులు, అందుబాటులోని సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య పథకాలను ఎంతవరకు పొందుతున్నారనే అంశాలపై క్షేత్రస్థాయి స్థితిగతులను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. కరోనాకు ముందు రాష్ట్రంలో ఈ తరహా సర్వే చేపట్టిన సిగ్మా రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో పాత 13 జిల్లాల్లో సుమారు 14 వేల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ డాక్టర్ యు.వి. సోమయాజులు తెలిపారు. ఇప్పటివరకు జాతీయ కుటుంబ సర్వే ఐదు విడతలు పూర్తయిందని.. దేశవ్యాప్తంగా ఆరో విడత సర్వే ప్రారంభం కాబోతోందన్నారు. కరోనా తర్వాత జరుగుతున్న సర్వే అయినందున.. కొవిడ్ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకాలు పొందిన వారి వివరాలు, కరోనా బారినపడితే అందుకు అయిన ఖర్చుల వివరాలను కూడా సేకరించబోతున్నారు. అలాగే మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య వివరాలపై అభిప్రాయాలను తెలుసుకుంటామన్నారు.