రాజ్యాధికారం లక్ష్యంగా డిసెంబర్ 7 నుండి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర - బీసీల సంక్షేమం కోసం మరో స్వాతంత్ర పోరాటం: బీసీ సంఘాల నేతలు - Vizag News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 8:07 PM IST
National BC Welfare Association Meeting in Visakhapatnam:దేశంలో ఏ పార్టీ కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా బీసీలను వాడుకొని అనంతరం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అయితే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందో వారికే మద్దతిస్తామని బీసీ సంఘాల నాయకులు అన్నారు. రాష్ట్రంలోని బీసీలను ఐక్యం చేసేందుకు రథయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖలో జరిగిన జాతీయ బీసీ సంఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీల సంక్షేమం కోసం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుతున్నామని.. ఇందులో భాగంగా బీసీల రాజ్యాధికారం కోసం డిసెంబర్ 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు శాసనసభలో 90 శాతం సీట్లు, పార్లమెంట్లో 12 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా తమ డిమాండ్లు అమలు చేయకపోతే జరగబోయే ఎన్నికలో ఖచ్చితంగా బీసీల సత్తా చాటుతామని తెలిపారు.