Narsipatnam Municipality Meeting Turns into Fighting: రసాభాసగా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం.. టీడీపీ, జనసేన కౌన్సిలర్లు వాకౌట్ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 31, 2023, 9:29 PM IST
Narsipatnam Municipality Meeting Turns into Fighting :అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ఛైర్‌పర్సన్ బాధపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టీడీపీ, జనసేనకి చెందిన కౌన్సిలర్లు పలు సమస్యలపై నిలదీశారు. అయితే అధికార పార్టీ నాయకులు, ఛైర్‌పర్సన్ సమాధానం చెప్పకుండా హేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. అంతకుముందు జనసేన పార్టీ కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య.. ఛైర్‌పర్సన్ తనని చులకనగా మాట్లాడారంటూ వాకౌట్ చేసి కార్యాలయం ముందు బైఠాయించి ఛైర్పర్సన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లెక్కల్లో పొంతన లేకపోవడంతో తాము ప్రశ్నించామని అయితే వీటికి సరైన సమాధానం చెప్పడంలో అధికార పార్టీ నాయకులు, ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు విఫలమయ్యారంటూ సౌజన్య ఆరోపించారు. తమ వార్డుల్లో విద్యుత్తు సదుపాయం కల్పించాలని ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ స్పందించలేదంటూ టీడీపీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే పట్టణ ప్రజలు వైసీపీ నేతలకు బుద్ధి చెప్తారని కౌన్సిలర్లు హెచ్చరించారు.