రసాభాసగా నరసాపురం మున్సిపల్ సమావేశం - 'అవినీతి నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్దం' - ap news today
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 7:23 PM IST
Narasapuram Muncipal Council Budget Meet: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం వ్యక్తిగత ఆరోపణలతో రసాభాసాగా మారింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ అధ్యక్షతన ప్రారంభం కాగా, ఆరోపణలతో మొదలై సవాళ్లు చేసుకునే వరకు వెళ్లింది. కౌన్సిల్ బడ్జెట్ మొత్తంలో అంకెల గారెడీ తప్ప, కొత్త విషయాలు గానీ, పట్టణాభివృద్ధికి బడ్జెట్ కేటాయించలేదని మాజీ ఛైర్‌పర్శన్ భర్త కోటిపల్లి సురేశ్ విమర్శించారు. దీంతో అధికార కౌన్సిలర్లు గంగరాజు, మాజీ ఛైర్‌పర్శన్ భర్త చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
మాజీ ఛైర్‌పర్సన్ కోటిపల్లి పద్మ నరసాపురం మున్సిపాలిటీ చరిత్రలోనే అధిక లబ్ది పొందారని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. దీనికి సురేశ్ స్పందిస్తూ తన భార్య అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగినట్లు నిరూపిస్తే, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. కౌన్సిల్ సమావేశం పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశంలో వ్యక్తిగత ఆరోపణలు విడిచిపెట్టాలని ఛైర్‌పర్సన్, సభ్యులు ఇరువురికి సర్దిచెప్పగా వివాదం సద్దుమణిగింది.