Lokesh Yuvagalm: జోరుమీదున్న యువగళం.. రేపు 2000 కిలోమీటర్లు పూర్తి - లోకేశ్ యువగళం
Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయికి చేరువలోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 11వ తేదీన పాదయాత్ర 153వ రోజున 50శాతం లక్ష్యానికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 1000 కి.మీ. మైలురాయి చేరుకుంది. వడివడిగా.. లక్ష్యం దిశగా యువనేత లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్నారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన యువనేత ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని చేరుకోనున్నారు. ఇప్పటివరకు సుమారు 30లక్షల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. 49చోట్ల బహిరంగసభలో యువనేత ప్రసంగించారు. వివిధవర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు.