Nara Lokesh Yuvagalam Padayatra: 'టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్' - dsc notification in 2025
Nara Lokesh Yuvagalam Padayatra in Prakasam District : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. 158వ రోజు కొండపి నియోజకవర్గంలోని మాలెపాడు నుంచి చెరుకంపాడు వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మాలెపాడులో పాడి రైతులతో ముఖాముఖీ నిర్వహించిన లోకేశ్.. ఒంగోలు డెయిరీని సైతం అమూల్‌కు అప్పగించి రైతులకు జగన్ అన్యాయం చేయనున్నారని లోకేశ్ మండిపడ్డారు.
యువగళం పాదయాత్రలో భాగంగా కె.అగ్రహారం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ ప్రాంగణమంతా జనసంద్రంతో కిక్కిరిసి పోయింది. ఈ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ పాలనా అకృత్యాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2025 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేశ్ హమీ ఇచ్చారు. మహిళల సంక్షేమానికి మా పార్టీ కట్టుబడి ఉందని, పేదలకు ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తామన్నారు. తెలుగింటి ఆడపడచుల కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కరెంట్, ఆర్టీసీ, ఇంటిపన్ను ధరలు పెంచారని అన్నారు. జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయని అన్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగన్ అని అన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేశ్ అన్నారు.