Lokesh in Palnadu గ్రామీణ ప్రజలకు తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది: నారా లోకేశ్ - Yuvagalam Padayatra
Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 172వ రోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పాదయాత్ర దర్శి నియోజకవర్గంలోని కెల్లంపల్లి శిబిరం నుంచి ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు స్థానికులు లోకేశ్‌కు సమస్యలు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తరువాత సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలోకి యాత్ర ప్రవేశించే సమయంలో భారీగా చేరుకున్న అభిమానులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. పల్నాడు జిల్లాలో నారా లోకేశ్‌ను నూజెండ్ల గ్రామస్థులు కలిశారు. డ్రైనేజ్‌లు లేక ఇబ్బందులు పడుతున్నామని.. పంటలు పండక జీవనోపాధి కోసం వలసలు వెళ్తున్నామంటూ నూజెండ్ల గ్రామస్థులు వాపోయారు. దీనిపై స్పందించిన లోకేశ్.. గ్రామీణ ప్రజలకు తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. జల్ జీవన్ మిషన్ అమలులో బిహార్ కంటే రాష్ట్రం వెనుక ఉందని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులన్నీ తిరిగి చేపడతామన్నారు. సాగర్ కాల్వల ఆధునికీకరణ చేపట్టి కాల్వల చివరివరకు సాగునీరు ఇస్తామని.. పంటలకు పుష్కలంగా నీరు అందజేసి వలసలను నివారిస్తామని గ్రామస్థులతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ అన్నారు.